: యూపీలోనూ ‘వ్యాపం’ తరహా కేసు... మాజీ సీఎం మాయావతిని ప్రశ్నించనున్న సీబీఐ
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను ముప్పుతిప్పలు పెడుతున్న వ్యాపం స్కాం తరహా భారీ కుంభకోణం ఒకటి ఉత్తరప్రదేశ్ లోనూ వెలుగుచూసింది. బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి సీఎంగా ఉన్న సమయంలో ఆ రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్ హెచ్ఎం) కింద విడుదలైన నిధుల్లో ఏకంగా రూ.10 వేల కోట్లు దుర్వినియోగమయ్యాయట. దీనిపై ఇప్పటికే కేసు నమోదు చేసిన సీబీఐ పలువురిని విచారించడమే కాక మాయావతి సన్నిహితుడు బాబు సింగ్ కుష్వాహాను అరెస్ట్ చేసింది. తాజాగా ఈ కేసులో మాయావతి పాత్రకు సంబంధించి కుష్వాహా సీబీఐకి కీలక సమాచారం అందించినట్లు విశ్వసనీయ సమాచారం. కుష్వాహా ఇచ్చిన సమాచారం ఆధారంగా మాయావతిని కూడా ప్రశ్నించేందుకు సీబీఐ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్ఆర్ హెచ్ఎం నిధులను స్వాహా చేసేందుకు నాడు సీఎం హోదాలో మాయావతి జిల్లాకో అధికారిని ప్రత్యేకంగా నియమించుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఈ కేసులో ప్రధాన సాక్షులుగా ఉన్న ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణించిన వైనంపైనా సీబీఐ దృష్టి సారించినట్లు సమాచారం.