: వచ్చి చూడండి... ఆ తర్వాతే పెట్టుబడి పెట్టండి: సింగపూర్ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు
సింగపూర్ పర్యటనలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తనదైన శైలిలో దూసుకెళుతున్నారు. నవ్యాంధ్రకు పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా రెండు రోజుల క్రితం సింగపూర్ వెళ్లిన ఆయన అక్కడ కాలుమోపిన దగ్గర నుంచి వేగంగా పావులు కదుపుతున్నారు. సింగపూర్ లో విమానం దిగీదిగగానే రంగంలోకి దిగిపోయిన ఆయన అక్కడి పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ సంస్థలతో వరుస భేటీలు నిర్వహించారు. నిన్న ‘ఇన్ స్టిట్యూట్ ఆప్ సౌత్ ఏసియా స్డడీస్’ సమావేశంలో ప్రసంగించిన చంద్రబాబు అక్కడి పారిశ్రామికవేత్తలను వినూత్న ప్రతిపాదనలతో ఆకట్టుకున్నారు. నవ్యాంధ్రలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. ముందుగా ఏపీకి వచ్చి అక్కడి పరిస్థితులను పరిశీలించాలని ఆయన పేర్కొన్నారు. పరిశీలనలో సానుకూల అంశాలు కనిపిస్తేనే పెట్టుబడులు పెట్టండని ఆయన వారిని ఆహ్వానించారు. చంద్రబాబు సరికొత్త ప్రతిపాదన అక్కడి పారిశ్రామికవేత్తలను బాగానే ఆకట్టుకుంది. రాష్ట్ర విభజన తర్వాత కేవలం 16 నెలల కాలంలోనే నవ్యాంధ్రను దేశంలోనే రెండో స్థానంలో నిలిపిన వైనాన్ని ఆయన వారికి వివరించారు. భవిష్యత్తులో ఏపీ భారత సిలికాన్ వ్యాలీగా రూపుదిద్దుకోనుందని కూడా చంద్రబాబు పేర్కొన్నారు.