: మృత్యుశకటం...పోలీస్ ఔట్ పోస్ట్ లోకి చొచ్చుకెళ్లిన లారీ, కానిస్టేబుల్ దుర్మరణం, ముగ్గురికి గాయాలు
హైదరాబాదులో నిన్న రాత్రి ఓ లారీ మృత్యుశకటంలా మారింది. రోడ్డుపై వెళుతున్న ఆ వాహనం ఒక్కసారిగా అదుపు తప్పి ఏకంగా పోలీస్ చెక్ పోస్టులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్ చనిపోగా, మరో ముగ్గురు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాల్లోకెళితే... హైదరాబాదు పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై గోల్కొండ సమీపంలోని రాందేవ్ గూడ వద్ద కొత్తగా పోలీస్ చెక్ పోస్టు ఇటీవలే ఏర్పాటైంది. మొత్తం 8 మంది కానిస్టేబుళ్లు అక్కడ పనిచేస్తుండగా, నిన్న అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఔట్ పోస్ట్ లో నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. ఈ సమయంలో ఎస్ఎంఆర్ బిల్డర్స్ సంస్థకు చెందిన ఓ లారీ పోలీస్ చెక్ పోస్టుపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ రాహుల్ యాదవ్ అక్కడికక్కడే చనిపోయాడు. తప్పించుకునేందుకు యత్నించిన ముగ్గురు కానిస్టేబుళ్లు సైదులు, వీరేందర్, పవన్ లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని నగరంలోని కేర్, అపోలో ఆసుపత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఇక ఈ ప్రమాదానికి డ్రైవర్ యాదగిరి డ్రంకన్ డ్రైవే కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.