: ఆన్ లైన్ ఐటీ డిగ్రీ కోర్సులు ప్రారంభించిన గూగుల్
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సంస్థ భారత్ లో ఆన్ లైన్ డిగ్రీ కోర్సులు ప్రారంభించింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ లో యాప్స్ తయారు చేసేందుకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను తయారు చేసే ఉద్దేశ్యంతో గూగుల్ ఈ కోర్సులు ప్రారంభించింది. దీని కోసం గూగుల్ ఆన్ లైన్ ఎడ్యుకేషన్ సంస్థ ఉడాసిటీతో అనుసంధానమైంది. గూగుల్ ఆండ్రాయిడ్ నానో డిగ్రీ కోర్సు కోసం నెలకు 9,800 రూపాయలు (148 యూఎస్ డాలర్లు) చెల్లించాల్సి ఉంటుంది. అమెరికాలోని గూగుల్ ఇన్ స్ట్రక్టర్లు పాఠాలు బోధిస్తారు. అలాగే గూగుల్, టాటా ట్రస్ట్ కలిసి భారత దేశంలో ఆండ్రాయిడ్ నానో డిగ్రీ చేసే విద్యార్థుల్లో వెయ్యి మందికి ఉపకార వేతనాలు ఇస్తాయని గూగుల్ వెల్లడించింది. వచ్చే ఏడాది గూగుల్ నిర్వహించనున్న ఉద్యోగ మేళాకు ఆండ్రాయిడ్ నానో డిగ్రీ హోల్డర్లు హాజరుకావచ్చని గూగుల్ తెలిపింది.