: బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ పై పోలీసు కేసు
వినియోగదారులను మోసం చేసేలా ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ చేసిన ఫిర్యాదు నేపథ్యంలో బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు ఫరాన్ అక్తర్ పై కూడా కేసు నమోదైంది. కేశవ్ నగర్ కు చెందిన రాజత్ బన్సాల్ అనే న్యాయవాది ఈ మేరకు మదియాన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆన్ లైన్ షాపింగ్ సైట్ కు రణబీర్, ఫరాన్ అక్తర్ లిద్దరూ ప్రకటన లిచ్చారని, వాటిని చూసి తాను మోసపోయానని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. 40 అంగుళాల ఎల్ఈడీ టీవీ కోసం ఆగస్టు 23న 'ఆస్క్ మి బజార్'లో ఆన్ లైన్ షాపింగ్ చేశానని, తన డెబిట్ కార్డు ద్వారా రూ. 29,999 కూడా చెల్లించానని, ముందుగా ప్రకటించిన తేదీల్లో తాను ఆర్డరు చేసింది రాకపోగా, బిల్లు మాత్రం పంపారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. రణబీర్, అక్తర్ ల కారణంగానే తాను ఆ సైట్ కు ఆకర్షితుడనయ్యానని ఆ న్యాయవాది పేర్కొన్నట్లు పోలీసులు చెప్పారు. ఆస్క్ మి బజార్ ఆన్ లైన్ షాపింగ్ సైట్ డైరైక్టర్లపై కేసులు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.