: సెల్ ఫోన్ వాడకంలో అమ్మాయిలే ఫస్టు!
సెల్ ఫోన్ వాడకంలో అమ్మాయిలే ఫస్టు అని ఓ సర్వే చెబుతోంది. సెల్ ఫోన్ వాడకంలో అమ్మాయిలు, అబ్బాయిల్లో ఎవరిది పై చేయి? అంటూ అమెరికాలోని బేలర్ యూనివర్సిటీ చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. నిత్యం చేతిలో ఉండే సెల్ వాడకంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ముందుంటున్నారని సర్వే తేల్చింది. సగటున రోజుకు 10 గంటల కాలం సెల్ లోనే అమ్మాయిలు గడిపేస్తున్నట్టు సర్వే వివరించింది. అబ్బాయిలు కూడా రోజుకి 8 గంటల చొప్పున సెల్ తో కాలం వెళ్లదీస్తున్నట్టు పేర్కొంది. సెల్ కు బానిసలమయ్యామని 60 శాతం మంది విద్యార్థులు అంగీకరించారని పరిశోధకులు తెలిపారు. ఇంటర్నెట్, సోషల్ మీడియా, వీడియో గేమ్స్ కోసం ఫోన్ ను ఎక్కువ మంది వాడుతున్నట్టు సర్వే తెలిపింది. అబ్బాయిలు ఎంటర్ టైన్ మెంట్ కోసం సెల్ ఫోన్ వాడితే, అమ్మాయిలు సామాజిక విషయాల కోసం సెల్ ఫోన్ వాడుతున్నట్టు సర్వే తెలిపింది. అయితే సెల్ వాడకం మితిమీరడం ప్రమాదకరమని, బానిసలుగా మారితే మొదటికే మోసం వస్తుందని గుర్తించాలని పరిశోధకులు సూచించారు. చదువులో వెనుకబడిపోతారనే విషయం గుర్తించాలని పరిశోధకులు పేర్కొన్నారు.