: స్టీవ్ జాబ్స్ లా పని చేయాలి: రాహుల్ ఉద్బోధ
యాపిల్ సంస్థను శక్తిమంతంగా తీర్చిదిద్దేందుకు స్టీవ్ జాబ్స్ ఎంత కష్టపడ్డారో, యూపీలో కాంగ్రెస్ ను బలపరచేందుకు అంతలా కష్టపడాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్ లోని మధుర దేవాలయం సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ పునర్నిర్మాణంలో ప్రతి కార్యకర్త భాగస్వామి కావాలని ఆకాంక్షించారు. ఉత్తరప్రదేశ్ లో పార్టీ కార్యకర్తలు అంకిత భావంతో పనిచేసి, పార్టీని శక్తిమంతంగా తయారు చేయాలని సూచించారు. త్వరలో రానున్న యూపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతి కార్యకర్త అంకితభావంతో పని చేయాలని ఆయన సూచించారు. సిద్ధాంతాలే తమ పార్టీని నెంబర్ వన్ స్థానంలో నిలబెడతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. విదేశాల నుంచి నల్లధనం తీసుకురావడంలో బీజేపీ విఫలమైతే, స్వదేశంలో రైతుల నుంచి భూమిని బలవంతంగా సేకరించే బిల్లును కాంగ్రెస్ బలంగా అడ్డుకుందని ఆయన తెలిపారు.