: దయ్యాలను అమ్మేస్తున్నాడు...విషయం తెలిసి అవాక్కయిన పోలీసులు!
ముందుగా వినియోగదారుడి బలహీనతలు తెలుసుకుంటే వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుందనేది బిజినెస్ లోని ప్రాథమిక సూత్రం. ఆ సూత్రాన్ని నరనరాన జీర్ణించుకున్న ఓ వ్యక్తి ఏకంగా దయ్యాలను అమ్మెసి సొమ్ము చేసుకుంటున్నాడు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా వున్నా ఇది నిజమే! ఛత్తీగఢ్ లోని జస్ పూర్ ప్రాంతంలో సర్కోబ్ గ్రామస్తులకు దయ్యాలున్నాయన్నది ప్రగాఢ విశ్వాసం. వాటిని మంచి చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. వారి నమ్మకాన్ని పెట్టుబడిగా వ్యాపారం ప్రారంభించాడు నారాయణ్ యాదవ్ అనే వ్యక్తి. తన దగ్గర దయ్యాలు ఉన్నాయని, వాటిని కొనుక్కుంటే అదృష్టం కలిసి వస్తుందని పేర్కొంటూ వ్యాపారం వృద్ధి చేసుకున్నాడు. దయ్యాలు కనపడవు కనుక నిరూపించాల్సిన అవసరం లేదు. దయ్యాలే లేవు, నీదంతా బూటకపు వ్యాపారం అని ఎవరైనా నిలదీస్తే కనుక, దయ్యాలున్న విషయం హనుమాన్ ఛాలీసాలో ఉంది చూసుకోండని చెబుతాడు. గ్రామస్థుల అవసరాలు కనిపెట్టి, వారిని భయపెట్టి, ఇలా లేని దయ్యాలను అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడు. దీంతో ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో అవాక్కైన పోలీసులు, నిజంగా దయ్యాలను అమ్ముతున్నాడని నిర్ధారించుకుని, నారాయణ్ యాదవ్, అతని ఇద్దరు అనుచరులకు అరదండాలేసి తీసుకెళ్లిపోయారు.