: కార్మికుల నిర్లక్ష్యంతో ఒక ప్రాణం బలి


రోడ్డుపైనున్న గొయ్యిలో పడిపోయిన వ్యక్తిని చూడకుండా కార్మికులు కంకరపోసి పూడ్చేయడంతో అతను మృతి చెందిన సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. కాట్ని జిల్లాలోని ఉడ్లానా-హతా మార్గంలో మూడురోజుల క్రితం చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాలు...ఖాద్రా గ్రామానికి చెందిన లటోరి బర్మాన్ (45) తన భార్యతో కలిసి రిషి పంచమి వేడుకలకు అత్తగారింటికి వెళ్లాడు. వేడుకల మర్నాటి రాత్రి బర్మాన్ ఒక్కడే తన స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో ఒక షాపులో మద్యం తాగాడు. చిన్నగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న బర్మాన్ ఒక్కసారిగా అక్కడ ఉన్న ఒక గొయ్యిలో పడిపోయాడు. మత్తెక్కడంతో పైకి లేవలేకపోయాడు. ఆ గొయ్యిలోనే ఉండిపోయాడు. అయితే, రోడ్డుపై ఉన్న గొయ్యిలను పూడ్చే పనులు జరుగుతుండటంతో కార్మికులు కొంతమంది అక్కడికి వెళ్లారు. ఈ గొయ్యిలో అతను పడి ఉండటాన్ని గుర్తించని కార్మికులు పైన కంకర పోసేశారు. కట్ చేస్తే..బర్మన్ చెయ్యి బయటపడటంతో అసలు విషయం వెలుగు చూసింది. దీంతో మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. కార్మికుల నిర్లక్ష్యం వల్లే బర్మా ప్రాణాలు పోయాయని వారు ఆరోపించారు. కాగా, ఆ జిల్లా కలెక్టర్ రూ.50 వేలు నష్టపరిహారంగా ప్రకటించారు. గొయ్యిలో అతను పడిన విషయాన్ని గుర్తించకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని విచారణాధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News