: మా విరాళాలు తిరిగిచ్చేయండి!... ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీకి అమెరికన్ పటేళ్ల శ్రీముఖాలు
పటేల్ సామాజిక వర్గానికి ఓబీసీ రిజర్వేషన్ల కోసం పోరు బాట పట్టిన గుజరాత్ యువ సంచలనం హార్దిక్ పటేల్ కారణంగా కేంద్రంలోని అధికార బీజేపీకి ఇటు దేశంలోనే, అటు అంతర్జాతీయంగానూ కష్టాలు తప్పడం లేదు. గతేడాది నరేంద్ర మోదీ అమెరికా పర్యటనను దిగ్విజయం చేయడంలో అమెరికాలో స్థిరపడ్డ పటేళ్లు కీలక భూమిక పోషించిన సంగతి తెలిసిందే. తాజాగా హార్దిక్ పటేల్ చేపట్టిన ఆందోళనపై గుజరాత్ లోని బీజేపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో అమెరికాలో పర్యటించనున్న మోదీకి పటేళ్ల నిరసన సెగలు తగలడం ఖాయంగానే కనిపిస్తోంది. కేవలం నిరసనలకే పరిమితం కాని అమెరికన్ పటేళ్లు గుజరాత్ పటేళ్ల తరహాలోనే ఆర్థిక సహాయ నిరాకరణకు సమాయత్తమవుతున్నారు. అంతేకాక గతేడాది మ్యాడిసన్ స్క్వేర్ వద్ద జరిగిన మోదీ సభ కోసం తాము అందించిన విరాళాలను తిరిగిచ్చేయాలని వారు ‘ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆప్ బీజేపీ’కి నోటీసులు ఇస్తున్నారు. అంతేకాక విదేశాల్లోని ఆ సంస్థ నుంచి తప్పుకుంటున్నట్లు కూడా అమెరికన్ పటేళ్లు తేల్చిచెబుతున్నారు. ఇప్పటికే కొంతమంది రాజీనామాలు చేయగా, మరికొందరు అదే బాటలో పయనిస్తున్నారు. అలబామాకు చెందిన నిరవ్ పటేల్ ఇప్పటికే రాజీనామా చేయడంతో పాటు తాను అందజేసిన విరాళాన్ని తిరిగిచ్చేయాలని నోటీసు పంపారు. ‘‘మోదీ మ్యాడిసన్ స్క్వేర్ సభకు 10 వేల డాలర్లను విరాళంగా ఇచ్చాను. ప్రస్తుతం ఆ విరాళాన్ని తిరిగి ఇచ్చేయాలని కోరాను’’ అని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీకి చంద్రకాంత పటేల్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. చంద్రకాంత్ ను ఆ పదవికి రాజీనామా చేయాలన్న ఒత్తిడి క్రమంగా పెరుగుతోందట.