: తొమ్మిది రోజులుగా సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులు : కొనసాగుతున్న సహాయకచర్యలు


గత తొమ్మిది రోజులుగా బిలాస్ పూర్ సొరంగంలో చిక్కుకుపోయిన ముగ్గురు కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సిమ్లాకు 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిలాస్ పూర్ లో ఉన్న సంఘటనా స్థలంలో రెస్క్యూ వర్కర్లు రంగంలోకి దిగారు. హిమాచల్ ప్రదేశ్ హైవే ప్రాజెక్టులో భాగంగా కార్మికులు సొరంగం తవ్వుతున్నారు. ఈ నెల 12వ తేదీన వందలాది కార్మికులు ఈ పనులలో పాల్గొన్నారు. ఆ సొరంగంలోని పెద్ద పెద్ద బండరాళ్లను తొలగిస్తున్న సందర్భంలో ముగ్గురు కార్మికులు అక్కడే చిక్కుకుపోయారు. సుమారు 50 మంది రెస్క్యూ వర్కర్ల బృందం, జైపూర్ నుంచి తెప్పించిన డ్రిల్లింగ్ మిషన్ ను ఉపయోగించి కొండపై నుంచి సొరంగం రూఫ్ కు ఒక పొడుగాటి రంధ్రం చేశారు. దాని ద్వారా వారికి గాలి ఆడటానికి ఆస్కారం ఉంటుందని, ఆహారం అందించేందుకు వీలుగా ఉంటుందనే ఉద్దేశ్యంతోనే ఈ ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. సొరంగంలో ఇరుక్కుపోయిన కార్మికుల గురించి తెలుసుకునేందుకు ఒక పైపు ద్వారా సొరంగంలోకి ఒక వీడియో కెమెరాను అమర్చినట్లు అధికారులు చెప్పారు. ‘మనము ఇంకా 7,8 రోజులు బతుకుతాము’ అంటూ సొరంగంలో చిక్కుకుపోయిన ఇద్దరిలో ఒకరైన సతీష్ తోమర్ తోటి కార్మికుడు మణిరామ్ తో అంటున్న సమాచారం వీడియో ద్వారా తెలిసింది. మరో కార్మికుడు హృదయ్ రామ్ సమాచారం తెలియడం లేదని జైదీప్ సింగ్ అనే అధికారి ఒకరు చెప్పారు. సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులు నీరసించిపోకుండా ఉండేందుకు జీడిపప్పు, బాదం, గ్లూకోజ్ బిస్కెట్లు, మంచినీటి బాటిళ్లను పైపు ద్వారా అందజేస్తున్నారు. సంఘటనా స్థలం దగ్గరే ఉన్న బాధితుల కుటుంబీకులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

  • Loading...

More Telugu News