: కర్నూలు జిల్లాలో భగ్గుమన్న ఫ్యాక్షన్... కేఈ, కోట్ల వర్గాల మధ్య ఘర్షణ, వ్యక్తి మృతి
ఫ్యాక్షన్ ఖిల్లా కర్నూలు జిల్లాలో మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి వర్గాల మధ్య అగ్గి రాజుకుంది. జిల్లాలోని ప్యాపిలి మండలం మునిమడుగులో చోటుచేసుకున్న ఈ ఘర్షణలో కేఈ వర్గానికి చెందిన నాసిర్ బాషా అనే వ్యక్తి చనిపోయాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారి పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన వారిని కర్నూలులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కర్రలు, రాళ్లు చేతబట్టిన ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. అనంతరం ఒక వర్గానికి చెందిన వారి ఇళ్లపై మరో వర్గం రాళ్ల వర్షం కురిపించింది. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో మునిమడుగు చేరుకున్నారు.