: సోము వీర్రాజుకు కీలక బాధ్యతలు... పార్టీ ఏపీ అధ్యక్షుడిగా నియమితులయ్యే అవకాశం
బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఏపీ రాజకీయాల్లో మరింత కీలకంగా మారనున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికలు, ఆ తర్వాత ఏపీ నేతలు, ప్రముఖులు ప్రధాని నరేంద్ర మోదీతో జరిపిన వరుస భేటీల్లో కీలకంగా వ్యవహరించిన సోము వీర్రాజు ఇటీవల పార్టీ ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిన నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఇదే మంచి తరుణమని పార్టీ జాతీయ నాయకత్వం భావిస్తోంది. దీంతో మిత్రపక్షం టీడీపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ప్రభుత్వ తప్పిదాలపై ఎప్పటికప్పుడు ఘాటుగా స్పందించాల్సిందేనని జాతీయ నేతలు రాష్ట్ర శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్న విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు, ఆ మేరకు రాణించలేకపోతున్నారన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలోనే జాతీయ నేతలు సోము వీర్రాజును రంగంలోకి దింపినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఆయన టీడీపీ ప్రభుత్వంపై అవకాశం దొరికినప్పుడల్లా విరుచుకుపడుతున్నారు. పోలవరం ముంపు గ్రామాల్లోని గిరిజనుల పక్షాన నిన్న సోము వీర్రాజు చేసిన ఘాటు వ్యాఖ్యలు కూడా ఇందులో భాగమేనన్న వాదన వినిపిస్తోంది. డిసెంబర్ ఆఖరు నాటికి పార్టీ రాష్ట్ర శాఖకు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంది. ఈ మేరకు సంస్థాగత ఎన్నికల పరిశీలకుడిగా కర్నూలు జిల్లాకు చెందిన పార్టీ ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్యను అధినాయకత్వం నియమించింది. కింది స్థాయి కార్యవర్గాల ఎంపికను డిసెంబర్ లోగా పూర్తి చేసి, వెనువెంటనే సోము వీర్రాజుకు పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పజెప్పే విధంగా పార్టీ అధినాయకత్వం వేగంగా పావులు కదుపుతోంది. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి రేసులో కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి ఉన్నా, సామాజిక వర్గాల సమతూకంలో భాగంగా వీర్రాజు వైపే జాతీయ నేతలు మొగ్గు చూపుతున్నారు. ఇక వీర్రాజు కాకుంటే, అదే సామాజిక వర్గానికి చెందిన ఏపీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావుకు ఆ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.