: ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు... తొలిసారి బీసీకి పట్టం కడుతున్న చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నేత, శ్రీకాకుళం జిల్లా ఉణుకూరు ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు ఎంపిక దాదాపుగా పూర్తయింది. ఈ మేరకు నిన్న సింగపూర్ పర్యటనకు వెళ్లేముందే పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఓ అవగాహనకు వచ్చారు. ఇక రాష్ట్ర కమిటీని పూర్తి చేసిన తర్వాత కిమిడికి పార్టీ పగ్గాలు అప్పజెప్పనున్నారు. ఉణుకూరు నుంచి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన కళా వెంకట్రావు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మునిసిపల్, హోం, వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత పార్టీ ఆయనను రాజ్యసభకు పంపింది. తదనంతర పరిణామాల్లో 2008లో పార్టీని వీడిన ఆయన టాలీవుడ్ నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అయితే ఆ పార్టీలో ఇమడలేక, స్వల్ప వ్యవధిలోనే సొంత గూటికి చేరుకున్నారు. అయినప్పటికీ ఆయనకు చంద్రబాబు మంచి ప్రాధాన్యమే ఇచ్చారు. పార్టీలోకి రాగానే ఉణుకూరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. గడచిన ఎన్నికల్లో విజయం సాధించిన కళా వెంకట్రావుకు ఏపీ కేబినెట్ లో మంత్రి పదవి కూడా దక్కాల్సి ఉంది. అయితే ఆయన సామాజిక వర్గం, సమీప బంధువు కిమిడి మృణాళినిని కేబినెట్ లోకి తీసుకున్న చంద్రబాబు, కళా వెంకట్రావును పార్టీ పదవికి గతంలోనే ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. తాజాగా తన మనసులోని మాటను బయటపెట్టిన చంద్రబాబు, పార్టీ పగ్గాలను తొలిసారి ఓ బీసీ నేతకు అప్పజెబుతున్నారు.