: రాహుల్ .. వంద నోటీసులిచ్చినా నేను భయపడను: మంత్రి స్మృతి ఇరానీ సవాల్
'వంద నోటీసులొచ్చినా నేను భయపడను. ఇదే గడ్డమీద నిలబడి సవాల్ చేస్తున్నా.. మీకు దమ్మూ ధైర్యం ఉంటే నన్ను జైల్లో పెట్టండి. నన్ను అరెస్టు చేసినా ప్రజల పక్షానే మాట్లాడతాను’ అంటూ రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ నిప్పులు చెరిగారు. రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గమైన అమేథీలో ఆదివారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి చెందిన స్వచ్ఛంద సంస్థ అక్కడి రైతుల భూములను లాక్కొందంటూ స్మృతి ఇరానీ చేసిన ఆరోపణలు గుర్తుండే ఉంటాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ విభాగం ఆమెకు లీగల్ నోటీసులు కూడా పంపింది. ఈ నేపథ్యంలోనే స్మృతి ప్రసంగం అలా ఘాటుగా సాగింది.