: విద్యార్థులకు నిద్రలేకుండా చేస్తున్న పాఠశాలలు!
విద్యార్థులకు సరిపడా నిద్ర లేకపోవడానికి పాఠశాలల సమయాలే కారణమట. హార్వర్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలతో కలిసి ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ పాల్ కెల్లీ చేసిన అధ్యయనం దీనిపై పలు విషయాలను తేటతెల్లం చేసింది. ఇటీవల నిర్వహించిన బ్రిటిష్ సైన్స్ ఫెయిర్ లో కెల్లీ మాట్లాడుతూ, పిల్లలకు ఉన్న వయస్సును అనుసరించి పాఠశాలకు వెళ్లే సమయాలు ఉండాలన్నారు. 8 నుంచి 10 సంవత్సరాల వయస్సులోపు వారు ఉదయం 8.30 గంటలు లేదా ఆ తర్వాత పాఠశాలకు వెళ్లాలన్నారు. అదే, 16 సంవత్సరాల వయస్సున్న వారైతే ఉదయం 10 గంటలకు, 18 సంవత్సరాల వయస్సుంటే ఉదయం 11 గంటలకు తమ విద్యా సంస్థలకు వెళ్లాలని కెల్లీ సూచించారు. బ్రిటిష్ పిల్లలు వారం మొత్తంలో సుమారు 10 గంటల నిద్ర నష్టపోతున్నారుట. దీనికితోడు ఇప్పటి పిల్లలు మొబైల్ ఫోన్లకు, ఐప్యాడ్లకు గంటలు గంటలు అతుక్కుపోతుండటం కూడా ఒక కారణమే అని చెప్పారు. నిద్ర నష్టపోతున్న విషయంలో బ్రిటిష్ పిల్లలతో పోలిస్తే భారత్ పిల్లలకు పెద్ద తేడా ఏమీ లేదట. నిద్ర లేమి కారణంగా డయాబెటిస్, స్థూలకాయం, డిప్రెషన్ మొదలైన రుగ్మతలకు గురవుతారని కెల్లీ తన రీసెర్చి పేపర్ లో పేర్కొన్నారు. పాఠశాలలు ప్రారంభమయ్యే సమయాలపై సుమారు 100 స్కూళ్లలో తన టీన్ స్లీప్ ప్రాజెక్టు ద్వారా కెల్లీ సర్వే నిర్వహించారు. భారతదేశంలో సూర్యోదయం కన్నా ముందే ఇంటి నుంచి పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య అధికంగా ఉందట. కొంతమంది నిపుణులు, వైద్యులు కెల్లీ సూచనలకు అంగీకరించినప్పటికీ పాఠశాల వేళల్లో మార్పులు చేయడం అంతా తేలికైన విషయం కాదంటున్నారు.