: మోదీ కార్పొరేట్ వర్గాల ఏజెంట్: సురవరం
ప్రధాని నరేంద్ర మోదీ కార్పొరేట్ వర్గాల ఏజెంట్ లా వ్యవహరిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి విమర్శించారు. శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతి పాలనను సాగిస్తున్నాయని మండిపడ్డారు. సంస్కరణల పేరుతో కార్మిక, ట్రేడ్ యూనియన్ల హక్కులను కాలరాస్తున్నారని ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు విదేశాల పిచ్చి పట్టుకుందని ఆయన పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి వివిధ వర్గాల ప్రజల నుంచి ఆర్థిక సాయం కోరుతూ, విదేశాల్లో తిరిగేందుకు ఉత్సాహం చూపుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల పక్షాన వామపక్ష పార్టీలు పోరాడుతున్నాయని చెప్పిన ఆయన, పెరిగిన ధరలకు వ్యతిరేకంగా అక్టోబర్ 5న దేశవ్యాప్త ఆందోళన చేపట్టనున్నామని ఆయన వెల్లడించారు.