: డీలర్ల నిర్లక్ష్యంతో విసిగిపోయి కొత్త కారును చెత్త వ్యానుగా మార్చేశాడు!
పలు కంపెనీల డీలర్లు వారి దగ్గర ఏదైనా వస్తువు కొనేటప్పుడు దాని గురించి అద్భుతంగా చెబుతారు. దానిలో సమస్య ఎదురైతే మాత్రం 'మాకు సంబంధం లేదు, కంపెనీకి పంపుతాం' అంటూ నైస్ గా తప్పించుకుంటారు. అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. డీలర్ల నిర్లక్ష్యంతో విసిగిపోయిన వినియోగదారుడు తన కారును చెత్తవ్యాన్ గా మార్చేశాడు. వివరాల్లోకి వెళ్తే... బరేలీ ప్రాంతానికి చెందిన అరవింద్ అగర్వాల్ అనే వ్యక్తి గత మార్చిలో ఓ కారును కొనుగోలు చేశాడు. ఏ ముహూర్తాన కారును కొన్నాడో కానీ, మర్నాటి నుంచీ రిపేర్లే... డీలర్ దగ్గరకు ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఫలితం ఉండడం లేదు. దీంతో ఏం చేయాలా? అని ఆలోచించిన అరవింద్ అగర్వాల్ కు తమ ప్రాంతంలో మున్సిపాలిటీ చెత్తను తీసుకెళ్లే వాహనాల కొరత ఉందని తెలిసింది. దీంతో కారు కొత్తదని కూడా ఆలోచించకుండా దానిని చెత్త వ్యాన్ గా మార్చేశాడు. ప్రస్తుతం ఆ వ్యాన్ లోనే డ్రైవర్ గా పని చేస్తూ, పలు ప్రాంతాలలో చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్ కు తీసుకెళ్తున్నాడు.