: తాగొస్తే... తిండి పెట్టొద్దు!: మహిళలకు ఏపీ స్పీకర్ కోడెల పిలుపు

కష్టపడి సంపాదిస్తున్న సొమ్ములో పేదలు మెజారిటీ వాటాను మద్యపానానికి తగలేస్తున్నారని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ వ్యాఖ్యానించారు. అలాంటి భర్తలను మార్చాల్సిన బాధ్యత భార్యలపైనే ఉందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిన్న గుంటూరు జిల్లాలోని నరసరావుపేట మార్కెట్ యార్డుకు వచ్చిన కోడెల మత్స్యకారులకు సైకిళ్లు, వలలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం తాగి వచ్చే భర్తలకు తిండిపెట్టొద్దని మహిళలకు సూచించారు. తద్వారా భర్తల మద్యపానం అలవాటును భార్యలు మాన్పించాలని ఆయన కోరారు. మద్యపానం మానేసిన వారి కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటునందిస్తామని కూడా ఆయన పేర్కొన్నారు