: అమరావతి శంకుస్థాపనకు భారీ ఏర్పాట్లు...నిర్వహణకు గ్లోబల్ టెండర్లు పిలిచిన ఏపీ ప్రభుత్వం
నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల 22న విజయదశమిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా అమరావతి పరిధిలో జరగనున్న ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా సింగపూర్, జపాన్ ప్రధానులు కూడా హాజరయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని సీఎం నారా చంద్రబాబునాయుడు నిర్ణయించారు. చంద్రబాబు ఆదేశాలతో ఇప్పటికే కార్యరంగంలోకి దిగిన సీఆర్డీఏ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 50 వేల మంది సామాన్య జనం ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా 50 ఎకరాల్లో కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక సర్వాంగసుందరంగా ఏర్పాటు కానున్న వేదికపై వందమందికి పైగా ఆసీనులు కానున్నారట. ఆహ్వాన పత్రికలను కూడా సరికొత్త రీతిలో తయారు చేస్తున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో ఎలాంటి చిన్న పొరపాటు కూడా దొర్లకుండా ఉండేలా పకడ్బందీ చర్యలు చేపడుతున్న ప్రభుత్వం, కార్యక్రమ నిర్వహణను ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థలకు అప్పగిస్తోంది. ఇందుకోసం సీఆర్డీఏ అధికారులు గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తూ ప్రకటనను జారీ చేశారు.