: తమిళ నాట మరో ‘ఖేమ్కా’... గ్రానైట్ మాఫియాను హడలెత్తిస్తున్న ఐఏఎస్ 'సహాయం'


గడచిన సార్వత్రిక ఎన్నికలకు ముందు హర్యానా కేడర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా, భూపీందర్ హుడా సర్కారుకు ముచ్చెమటలు పట్టించారు. రాబర్ట్ వాద్రా భూ కుంభకోణాన్ని వెలికితీసి ఒక్క హుడానే కాక ఏకంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కూడా ఆయన కొరకరాని కొయ్యగానే మారారు. ఈ క్రమంలో ఆయన 28 ఏళ్ల సర్వీసులో ఏకంగా 40 సార్ల కంటే ఎక్కువగానే బదిలీ అయ్యారు. తాజాగా తమిళనాడులోనూ ఖేమ్కా తరహాలోనే జయలలిత ప్రభుత్వానికి యు. సహాయం అనే ఐఏఎస్ అధికారి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. రాష్ట్రంలో గ్రానైట్ మాఫియాపై సహాయం ఉక్కుపాదం మోపారు. అక్రమార్కులకు సింహస్వప్నంలా మారిన సహాయం, కేసుల్లో సాక్ష్యాలను కాపాడేందుకు శ్మశానంలో ఓ రాత్రి ఏకంగా కడ్డీల మంచం వేసుకుని మరీ నిద్రపోయారు. అక్రమంగా గ్రానైట్ తవ్వకాలకు పాల్పడుతున్న ఓ కంపెనీ, ఇందుకోసం వికలాంగులను బలి ఇచ్చిందన్న ఆరోపణల్లో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు రంగంలోకి దిగిన సహాయంకు, మధురై జిల్లాలోని మణిముత్తారులో స్థానిక అధికారుల నుంచి సహాయ నిరాకణ ఎదురైంది. శ్మశానంలో తవ్వకాలు జరపాలన్న సహాయం ఆదేశాలను వారు అమలు చేయలేదు. కుంటిసాకులు చెబుతూ రేపు ఉదయం తవ్వుతామంటూ వారు సహాయంకు చెప్పారట. అయితే రాత్రికి రాత్రే సాక్ష్యాలు తారుమారు కానున్నాయన్న అనుమానం వచ్చిన సహాయం, తన సిబ్బందితో ఓ కడ్డీల మంచం తెప్పించుకని శ్మశానంలోనే ఆ రాత్రి నిద్ర పోయారు. ఇక్కడ నిద్రేమిటంటూ వారించిన మధురై ఎస్పీ సూచనను కూడా సహాయం తిరస్కరించారు. అనుకున్న మేరకు ఉదయం తవ్వకాలు జరపగా, నలుగురు వ్యక్తులకు చెందిన అస్థిపంజరాలు బయటపడ్డాయట. ఇక తన రోజువారీ విధుల్లోనూ సహాయం స్టైలే వేరు. లంచాలకు వ్యతిరేకంగా పోరాడటమే కాక, తన కార్యాలయం ముందు ఆయన ‘‘లంచాలను తిరస్కరించు... తలెత్తుకుని నిలబడు’’ అన్న బోర్డును కూడా ఏర్పాటు చేయించారు. నిజాయతీ వర్తనతో ఖేమ్కా మాదిరే సహాయం కూడా పలుమార్లు బదిలీలకు గురయ్యారు. తన 20 ఏళ్ల సర్వీసులో సహాయం 18 సార్లు బదిలీ అయ్యారట.

  • Loading...

More Telugu News