: ఒక్కో పోస్టుకు 1,700 మంది పోటీ... సింగరేణి ఉద్యోగాలకు పోటెత్తిన దరఖాస్తులు
కొత్త రాష్ట్రం తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ఊపందుకుంది. పలు టెక్నికల్ పోస్టుల భర్తీకి సింగరేణి కాలరీస్ ఇప్పటికే ఓ రాత పరీక్ష నిర్వహించింది. తాజాగా జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆ సంస్థ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ కు తెలంగాణలోని నిరుద్యోగుల నుంచి భారీ స్పందన లభించింది. కేవలం 471 పోస్టుల భర్తీ కోసం వెలువడిన ఈ నోటిఫికేషన్ కు ఏకంగా 90 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 84 వేల మంది అభ్యర్థుల దరఖాస్తులు అర్హమైనవిగా సింగరేణి తేల్చింది. అంటే, ఒక్కో పోస్టుకు ఏకంగా 1,700 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారన్నమాట. వచ్చే నెల 11న సింగరేణి పరిధిలోని నాలుగు జిల్లాలతో పాటు హైదరాబాదులోనూ రాత పరీక్షను నిర్వహించేందుకు ఆ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే ఆన్ లైన్ లో హాల్ టికెట్లను జారీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.