: రేవంత్ భుజం తట్టిన సబితా ఇంద్రారెడ్డి... చేవెళ్లలో అరుదైన దృశ్యం
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిన్న ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. మూడు దశాబ్దాలకు పైగా రాజకీయ ప్రత్యర్థులుగా పోరు సాగిస్తున్న టీడీపీ, కాంగ్రెస్ నేతలు ఒకే వేదికపై కనిపించారు. అంతేకాదు, తమ ఉమ్మడి రాజకీయ శత్రువు టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. టీడీపీ ఏర్పాటు చేసిన సభా వేదికపైకి ఎక్కిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలుగు నేలలో తొలి మహిళా హోం మంత్రిగా పనిచేసి రికార్డులకెక్కిన సబితా ఇంద్రారెడ్డి ఏకంగా టీ టీడీపీ యువనేత రేవంత్ రెడ్డి భుజం తట్టారు. కేసీఆర్ సర్కారుపై కలిసి పోరు సాగిద్దామని ఆమె పిలుపునిచ్చారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైన్ ను వ్యతిరేకిస్తూ టీడీపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్ గౌడ్ చేపట్టిన పాదయాత్ర నిన్న చేవెళ్లలో ముగిసింది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభకు రేవంత్ రెడ్డితో పాటు టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు తదితరులు హాజరయ్యారు. సభ జరుగుతున్న సమయంలోనే మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ తో కలిసి అక్కడికి వచ్చిన సబితా ఇంద్రారెడ్డి నేరుగా వేదిక ఎక్కి రేవంత్ భుజం తట్టారు. ఈ అరుదైన దృశ్యం కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.