: పోచారం... ఇలాగైతే కష్టమే!: కేబినెట్ భేటీలో మంత్రులకు క్లాస్ పీకిన కేసీఆర్


నిన్న దాదాపు ఐదు గంటల పాటు సాగిన తెలంగాణ కేబినెట్ సుదీర్ఘ భేటీలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు పలువురు మంత్రుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. పలు అంశాలపై విపక్షాలు సంధిస్తున్న విమర్శలపై మంత్రులు సరిగా స్పందించడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తాను చైనా పర్యటనలో ఉండగా, రాష్ట్రంలో పలు అంశాలపై ప్రతిపక్షాలు విసిరిన ఆరోపణలను తిప్పికొట్టడంలో మంత్రులు ఘోరంగా విఫలమయ్యారని కేసీఆర్ అన్నారు. రైతు ఆత్మహత్యలపై వస్తున్న విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టాల్సిన మంత్రులు అందులో ఏమాత్రం సఫలం కాలేకపోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్దిచెప్పే యత్నం చేసిన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డిపై కేసీఆర్ విరుచుకుపడ్డారట. ఇలాగైతే కష్టమేనంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో పోచారం ఆందోళనకు గురయ్యారు. అదే విధంగా యాలాల ఎస్సై రమేశ్ ఆత్మహత్య విషయంపై మంత్రి జగదీశ్ రెడ్డి కూడా సరిగా స్పందించలేదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారట. ఓ వైపు కొత్త పారిశ్రామిక విధానంపై చైనా పారిశ్రామికవేత్తలు సహా అందరూ ప్రశంసలు కురిపిస్తుంటే, అనవసర రాద్ధాంతం చేస్తున్న విపక్షాలను నిలువరించకపోతే ఎలాగంటూ ఆయన మంత్రులను ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News