: గ్రేటర్ లో తొలగించిన ఓట్లు 4.77 లక్షలు... అందులో కూకట్ పల్లి ఓట్లే 1.21 లక్షలు
గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలు ప్రాంతాల్లో ఓట్ల తొలగింపు అంశంపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నిబంధనల మేరకే బోగస్ ఓట్లను తొలించామని గ్రేటర్ అధికారులు చెబుతున్నా, విపక్షాలు మాత్రం ఇందులో అధికార పార్టీ ఆదేశాల మేరకే ఓట్లు గల్లంతయ్యాయని ఆరోపిస్తున్నాయి. గ్రేటర్ పరిధిలోని మొత్తం 18 సర్కిళ్ల పరిధిలో 4,77,972 గల్లంతయ్యాయి. వీటిలో ఒక్క కూకట్ పల్లి పరిధిలోనివే 1,21,085 ఉన్నాయని కూడా తేలడంతో విపక్షాల వాదనకు మరింత బలం చేకూరినట్లైంది. సీమాంధ్రకు చెందిన ప్రజలు అత్యధికంగా నివసించే కూకట్ పల్లి పరిధిలో ఓట్లు గల్లంతు కావడంపై అటు కాంగ్రెస్సే కాక టీడీపీ కూడా గ్రేటర్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.