: ఏపీకి ప్రత్యేక హోదాపై గళమెత్తిన తెలంగాణ సీనియర్ నేత
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ప్రత్యేకతే వేరు. తెలంగాణ ప్రాంత నేత అయినా, ఏపీకి చెందిన విషయాలపై కూడా స్పందించడం ఆయనకు అలవాటే. తాజాగా, ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఆయన స్పందించారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుపై నిప్పులు చెరిగారు. తెలంగాణ బిల్లు పాస్ కాకుండా ఎక్కువ అడ్డుకున్నది వెంకయ్యనాయుడే అని... అప్పట్లో ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసిన ఆయన, ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. ఏపీపై ఎక్కువ మొసలి కన్నీరు కార్చింది వెంకయ్యే అని విమర్శించారు. విజయవాడ, నెల్లూరుల్లో అడుగుపెట్టకుండా వెంకయ్యను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఏపీకి వచ్చినప్పుడు ఒక కథ, ఢిల్లీలో ఉన్నప్పుడు మరో కథ చెబుతూ కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నాటకాలు ఆడుతున్నారని అన్నారు.