: తొందరపడితే అన్నీ ఇబ్బందులే!: రఘురాం రాజన్
వడ్డీ రేట్లను ప్రస్తుతానికి పెంచరాదని యూఎస్ ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం వెలువడిన గంటల అనంతరం, ఇండియాలో వడ్డీ రేట్లను తగ్గించాలని డిమాండ్ చేస్తున్న పారిశ్రామిక, వ్యాపార వర్గాలకు ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ తనదైన సమాధానాన్ని ఇచ్చారు. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు తప్పవని, స్థిరమైన వృద్ధి కొనసాగేలా ముందడుగులు వేయాల్సి వుందని అన్నారు. సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో సీకే ప్రహ్లాద్ స్మారకోపన్యాసాన్ని ఆయనిచ్చారు. వడ్డీ రేట్ల కోత, పన్ను రాయితీల కారణంగా తాత్కాలిక ప్రయోజనాలు మాత్రమే దగ్గరవుతాయని ఆయన అన్నారు. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇన్ ఫ్లేషన్ తగ్గితే, వడ్డీలతో సంబంధం లేకుండానే వృద్ధి రేటు ప్రభావితం అవుతుందని అన్నారు. కాగా, ఈ నెల 29న ఆర్బీఐ పరపతి సమీక్ష జరగనుండగా, రెపో రేటును తగ్గించాలని పలు వర్గాల నుంచి విజ్ఞప్తులు వస్తున్న సంగతి తెలిసిందే.