: నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ లపై ఈడీ కేసు!
సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఆ పార్టీ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీలపై తాజాగా మరో కేసు నమోదు చేయాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో అక్రమ నగదు లావాదేవీలు జరిగాయన్నది ఈడీ వాదన. ఇప్పటికే కేంద్ర రెవెన్యూ విభాగం నుంచి న్యాయ సలహాలు కోరిన ఈడీ, అతి త్వరలోనే కాంగ్రెస్ నేతలపై కేసు పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే వీరిద్దరిపై క్లీన్ చిట్ రాగా, దీన్ని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ఈడీ తప్పుదారిలో నడిచి విచారణను తూతూ మంత్రంగా ముగించిందని ఆయన గతంలోనే ఆరోపించారు. ఈడీకి చీఫ్ గా ఉన్న రాజన్ కతోచ్ పదవీకాలాన్ని తగ్గించిన కేంద్రం ఆ పోస్టులో ప్రత్యేక డైరెక్టర్ గా కర్నాల్ సింగ్ ను నియమించింది. గతంలో ఈ కేసులో ఓ ట్రయల్ కోర్టు సోనియా, రాహుల్ లతో పాటు కాంగ్రెస్ నేతలు మోతీలాల్ ఓరా, సుమన్ దూబే, ఆస్కార్ ఫెర్నాండెజ్ లకు సమన్లు జారీ చేయగా, ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది. అప్పట్లో వీరి తరపున వాదనలు వినిపించిన కపిల్ సిబల్ ఎటువంటి నేర పూరిత చర్యలూ వీరు చేయలేదని కోర్టుకు తెలిపారు. కాగా, ప్రస్తుతం ఈ కేసును తిరగదోడి అక్రమ నగదు బట్వాడాలపై విచారించాలని ఈడీ భావిస్తున్నట్టు సమాచారం.