: చంద్రబాబు 'పంచ్'లు మంత్రుల ఉద్వాసనకు సంకేతమేనా?


"రెండంకెల అభివృద్ధిని నేను కోరుకుంటుంటే, కొన్ని మంత్రిత్వ శాఖలు రెండంకెల అవినీతిలో కూరుకుపోయాయి. ముఖ్యంగా రెవెన్యూ, ఆరోగ్య శాఖలు" నిన్న కలెక్టర్ల సదస్సు తొలిరోజు సమావేశాల్లో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను చర్చలకు దారితీశాయి. గతంలో పద్ధతి మార్చుకోవాలని తాను హెచ్చరించిన శాఖలనే మరోసారి ప్రస్తావించడంతో ఆయన 'దృష్టి'లో ఉన్న వారికి ఉద్వాసన తప్పకపోవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా మహిళా శిశు సంక్షేమ మంత్రి పీతల సుజాత, ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్, పంచాయతీరాజ్ మంత్రి అయ్యన్నపాత్రుడు, సాంఘిక సంక్షేమ మంత్రి రావెల కిశోర్‌బాబు, దేవాదాయ మంత్రి పి.మాణిక్యాలరావులతో పాటు ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖా మంత్రి కేఈ కృష్ణమూర్తి పేర్లు ఉద్వాసనను ఎదుర్కోనున్న వారిలో ఉన్నట్టు తెదేపా వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మంత్రుల తొలగింపు, మంత్రివర్గ విస్తరణ ఖాయంగా కనిపిస్తున్న తరుణంలో ఒక్కొక్కరి తొలగింపునకు ఒక్కో కారణాలు వినిపిస్తున్నా, చంద్రబాబు మాత్రం అభివృద్ధి ప్రగతి సూచికలు, సమీక్షలు, ప్రజా స్పందనలు పరిశీలించిన తరువాతనే నిర్ణయం తీసుకుంటానని చెబుతున్నారట. వాస్తవానికి మంత్రుల తొలగింపు మూడు నెలల క్రితం జరిగిన మహానాడు సందర్భంగానే తెరపైకి వచ్చినప్పటికీ, ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది కాలంలోనే మార్పులు చేస్తే, తప్పుడు సంకేతాలు వెళతాయని బాబు భావించారని తెలుస్తోంది. రేపు సింగపూర్ కు వెళ్లనున్న చంద్రబాబు తిరిగి రాగానే విస్తరణపై దృష్టి పెడతారని, రాజధాని అమరావతికి శంకుస్థాపన అనంతరం మంత్రివర్గం మారుతుందని అంచనా.

  • Loading...

More Telugu News