: ఏపీలో మిగిలేది ఒక్క పార్టీ మాత్రమే: రావెల జోస్యం
సింగపూర్ లో మాదిరిగా, ఆంధ్రప్రదేశ్ లోనూ ఏక పార్టీ విధానం రానుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖా మంత్రి రావెల కిషోర్ బాబు జోస్యం చెప్పారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ నానాటికీ బలపడుతోందని, త్వరలోనే మిగతా అన్ని పార్టీలూ అంతరించిపోతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటున్న బాలికలకు పుస్తకాలు పంపిణీ చేసిన ఆయన మాట్లాడుతూ, అమరావతికి రైతులు సహృదయంతో భూములు ఇవ్వడం విపక్ష నేత జగన్ కు ఎంతమాత్రమూ నచ్చలేదని ఆరోపించారు. దీంతోనే మచిలీపట్నం పోర్టుకు భూములిస్తామన్న రైతులను ఆయన ఆపుతున్నారని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం దొంగ దీక్షలు చేస్తున్న ఆయన్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, ఈ దీక్షలకు ప్రజా స్పందన లేకపోవడంతో డబ్బులను వెదజల్లి జనాలను తీసుకువస్తున్నారని దుయ్యబట్టారు.