: జైలు సిబ్బందిని బెదిరించి తప్పించుకున్న 21 మంది బాలనేరస్థులు
జైలు సిబ్బందిని బెదిరించి బాలనేరస్థులు తప్పించుకున్న ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... మధురలోని కొత్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నికేతన్ జువైనల్ హోంలో నిన్న ఇద్దరు వ్యక్తులు ఆయుధాలతో దాడులు చేశారు. జువైనల్ హోం గోడలు బద్దలుకొట్టి సిబ్బందిని బెదిరించారు. అనంతరం అక్కడి నుంచి ఇద్దరు చిన్నారులు, 19 మంది ఖైదీలను తీసుకుని పరారయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు అప్రమత్తమై ఒక చిన్నారి, 17 మంది ఖైదీలను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు ఖైదీలు, ఒక చిన్నారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. జువైనల్ హోంలో ఉన్న పూజ అనే యువతికి ఈ ఘటనతో సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం పూజతో పాటు మరో ఇద్దరు పరారీలో ఉన్నారని వారు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.