: భారత్ నిర్ణయంపై అమెరికా అసంతృప్తి... ఇలాగైతే పెట్టుబడులు రావని హెచ్చరిక!
భారత రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని 49 శాతానికి మాత్రమే పరిమితం చేయాలని భారత సర్కారు తీసుకున్న నిర్ణయంపై అమెరికా అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఐపీఆర్ (ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్) ఆధారిత సాంకేతికత అధికంగా మిళితమైవుండే ఈ రంగంలో హైటెక్నాలజీ ఇండియాలోకి రావాలంటే, ఎఫ్డీఐ పరిమితులు పెంచాల్సి వుందని పెంటగాన్ అధికారి ఒకరు తెలిపారు. నేడు ఇండియా, అమెరికాల మధ్య జెట్ ఇంజన్ సాంకేతికత బదలాయింపుపై చర్చలు జరగనున్న నేపథ్యంలో డిఫెన్స్ ఫర్ అక్విజిషన్, టెక్నాలజీ అండ్ లాజిస్టిక్స్ విభాగం డైరెక్టర్ కీత్ వెబ్ స్టర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే 49 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి కొనసాగితే, జెట్ ఇంజన్ సాంకేతికత సైతం ఇండియాకు దూరమవుతుందని ఆయన హెచ్చరించారు. కాగా, ఈ ఎఫ్డీఐ పరిమితులను సమీప భవిష్యత్తులోనే సవరిస్తామని, రక్షణ రంగంలో మరిన్ని విదేశీ పెట్టుబడులు వచ్చేలా నిర్ణయాలు తీసుకుంటామని ఇండియా హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని సైతం వెబ్ స్టర్ తెలిపారు. తమ దేశంలోని పరిశ్రమలు, ప్రభుత్వం ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు చూస్తున్నాయని, అయితే, ఎఫ్డీఐ అవధులు పెరగాల్సిన అవసరముందని ఆయన అన్నారు. ఇండియా తమ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నట్టు వివరించారు.