: భార్యపై పగతీర్చుకోవాలని కటకటాలపాలయ్యాడు
కర్ణాటకలో సభ్యసమాజం తలదించుకునే పనిచేసి కటకటాలపాలయ్యాడో వ్యక్తి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బెంగళూరుకు సమీపంలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్ కు చెందిన వెంకటప్ప (65) రెండు వివాహాలు చేసుకున్నాడు. దీంతో అతని మొదటి భార్య అతనితో గొడవపడేది. రెండో భార్యను వదిలేసి వచ్చేయాలని సూచించేది. ఎంత గొడవపడ్డా భర్త మనసు మారకపోవడంతో పదిమందిలో అతని పరువు తీసేసి, పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహించిన వెంకటప్ప ఎలాగైనా ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించి, తామిద్దరం ఏకాంతంగా గడిపిన ఫోటోలను పోస్టర్లుగా వేయించి ఊరంతా అంటించాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఆమె బంధువులతో పోస్టర్లు చించేయించిన పోలీసులు వెంకటప్పను అదుపులోకి తీసుకుని, పరారీలో ఉన్న అతని రెండో భార్య, పోస్టర్లు వేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.