: పోస్టర్లపై ఛండీగఢ్ కార్పోరేషన్ ఆగ్రహం... రూ.3.6 కోట్ల జరిమానా విధించిన వైనం
సామాజిక బాధ్యత లేని మన రాజకీయ పార్టీల కారణంగా ఎన్నికల సమయంలో మన నగరాలు కళా విహీనంగా మారిపోతున్నాయి. ఎక్కడపడితే అక్కడ పోస్టర్లను అంటిస్తున్న రాజకీయ పార్టీలు నగరాలను చెత్త కుండీలుగా మారుస్తున్నాయి. ఇలాంటి కార్యకలాపాలపై ఛండీగఢ్ మునిసిపల్ కార్పోరేషన్ కొరడా ఝుళిపించింది. నగర వ్యాప్తంగా వెలసిన పోస్టర్లపై సర్వే చేసి ఏకంగా రూ.3.6 కోట్ల జరిమానాను చెల్లించాలంటూ సదరు పోస్టర్లను అంటించిన సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఆయా సంస్థలకు చెందిన మొత్తం 51 మందికి కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ మొత్తంలో సింహభాగం రూ.2.88 కోట్లను కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్ యూఐ), ఆ పార్టీ పంజాబ్ యువజన విభాగాలపైనే పడింది. ఇక నోటీసులు జారీ అయిన 51 మందిలో 50 మంది విద్యార్థి సంఘాల నేతలే ఉన్నారని కార్పొరేషన్ అధికారులే చెబుతున్నారు. ఈ విషయంలో కొసమెరుపేంటంటే... ఎన్ఎస్ యూఐ, పంజాబ్ యూత్ కాంగ్రెస్ తరహాలోనే నిబంధనలకు విరుద్ధంగా పోస్టర్లు అంటించినప్పటికీ బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీ, అకాలీదళ్ విద్యార్థి విభాగం ఎస్ఓఐ లకు కార్పోరేషన్ నుంచి ఎలాంటి నోటీసులు జారీ కాలేదు.