: నీటి బకెట్ లో పడి మృతి చెందిన చిన్నారి
అప్పటి దాకా ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి, ప్రమాదవశాత్తు నీటితో నిండిన బకెట్ లో పడి ప్రాణాలు విడిచింది. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం పెద్దలవిన్న గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఉదయం రెండేళ్ల వయసున్న చిన్నారి నవిత తండ్రి వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్లాడు. మరోవైపు, కూతురు ఆడుకుంటోంది కదా అని, ఆమె తల్లి ఇంటి పని చేసుకుంటోంది. ఇంతలో, బకెట్ వద్దకు వెళ్లిన చిన్నారి ప్రమాదవశాత్తు అందులో పడిపోయింది. ఊపిరి ఆడక కన్నుమూసింది. తమ సర్వస్వం అనుకున్న కూతురు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.