: ఎయిర్ పోర్టు గేటును కారుతో ఢీకొట్టి, జెట్ విమానాన్ని దొంగిలించబోయి..!
అమెరికాలోని వాకో రీజనల్ ఎయిర్ పోర్టు. ఓ వ్యక్తి తన కారుతో వేగంగా వచ్చి రన్ వే సెక్యూరిటీ గేటును ఢీకొట్టాడు. లోపలికి వెళ్లి ఓ వ్యాపారవేత్తకు చెందిన చిన్న జెట్ విమానం ల్యాండింగ్ గేరుకు అడ్డుగా ఉన్న టైర్ చౌక్ లను తొలగించాడు. దానిలోకి ఎక్కి విమానాన్ని దొంగిలించే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన గురువారం నాడు చోటుచేసుకోగా, స్పందించిన విమానాశ్రయ సిబ్బంది ఆ వ్యక్తిని నిలువరించగలిగారు. చేతిలో ఒక కర్ర మాత్రమే ఉన్న ఆ వ్యక్తి మానసిక ఇబ్బందులు పడుతున్నట్టు అధికారులు గుర్తించారు. డ్యూటీ ముగించుకుని ఇంటికి బయలుదేరిన ఓ ఉద్యోగి ఇతనిని అడ్డుకునేందుకు విఫలయత్నం చేశాడని పోలీసులు తెలిపారు. మిగతా ఉద్యోగులు వచ్చేంతవరకూ ఆ వ్యక్తి లొంగలేదని వివరించారు. ఆపై అతనిపై నేరపూరిత కుట్ర, దొంగతనం, అరెస్టును నిరోధించడం వంటి సెక్షన్ల కింద కేసు పెట్టి మానసిక ఆరోగ్య అంచనా కోసం ఆసుపత్రికి తరలించారు. ఇతనిపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ట్రాన్స్ పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ విభాగాలు అదనపు కేసులను పెట్టనున్నట్టు తెలుస్తోంది.