: టీ పోలీస్ అదుపులో ముగ్గురు మావోలు... కోర్టులో హాజరుపరచాలంటున్న ప్రజా సంఘాలు


రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ పుంజుకున్న మావోయిస్టులపై తెలంగాణ పోలీసులు ముప్పేట దాడి మొదలుపెట్టారు. మొన్న వరంగల్ జిల్లాలో ఇద్దరు మావోలను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు అదే జిల్లాలో మరో ముగ్గురు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు మావోలతో పాటు వారికి సహకరిస్తున్నారన్న ఆరోపణలతో ఓ గ్రామస్థుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ప్రజా సంఘాలు పోలీసుల తీరుపై విమర్శలు గుప్పించాయి. అదుపులోకి తీసుకున్న మావోయిస్టు దళ సభ్యులు మహేశ్, కిష్టన్న, విమల్ లతో పాటు గ్రామస్థుడు శేఖర్ ను తక్షణమే కోర్టులో హాజరుపరచాలని విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు డిమాండ్ చేశారు. పోలీసుల అదుపులోని మావోయిస్టు దళ సభ్యులకు ఎలాంటి హాని జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా ఆయన హెచ్చరించారు. నిన్న ఉదయం జిల్లాలోని ఏటూరునాగారం మండలం చిట్యాలలో ఈ నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News