: కృష్ణా జిల్లాలో క్షుద్రపూజలు చేస్తున్న దుండగులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ప్రజలు
తెల్లారేసరికి ఇంటి ముందు ముగ్గు, దాని చుట్టూ నిమ్మకాయలు, పసుపు, కుంకుమలు చల్లబడిన పిండితో చేసిన బొమ్మ, దానిపై ముళ్లు, సూదులు... ఇది చదువుతుంటే ఏమనిపిస్తోంది? ఏదో చేతబడుల సినిమా కథలా వుంది కదా? కృష్ణా జిల్లా తిరువూరు మండలం వామకుంట్లలో ఇటీవల కొద్ది కాలంగా జరుగుతున్నది ఇదే. నిద్రలేచి చూసేసరికి ఎవరో ఒకరి ఇంటి ముందు కనిపించే దృశ్యమిదే. దీంతో తీవ్రభయాందోళనలకు గురైన ప్రజలు, చేతబడులు, క్షుద్రపూజలు చేస్తున్న వారిని పట్టుకోవాలని పథకం వేశారు. రాత్రంతా మేలుకుని కాపలా కాయాలని నిర్ణయించారు. ఇంకేముంది... రోజు మాదిరే గత రాత్రి కూడా పూజలు చేసేందుకు కొందరు వచ్చారు. దీంతో వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని దేహశుద్ధి చేశారు. తీరా వారు ఎవరని చూస్తే వామకుంట్లకు చెందిన వారే. నగేశ్, వెంకటరావమ్మ, రవి అనే వారు పట్టుబడగా, మరో ఇద్దరు పారిపోయారు. వీరిని పోలీసులకు అప్పగించిన గ్రామస్థులు, ఇంకో 40 మంది వరకూ చేతబడి చేస్తున్నారని, వారినీ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ రాత్రంతా రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు.