: వరుణ్ తేజ్ ముఖంలోని తీవ్రత సినిమాను సక్సెస్ చేస్తుంది: సిరివెన్నెల
'కంచె' సినిమాలో వరుణ్ తేజ్ ముఖంలో చూపించిన భావాలు హాలీవుడ్ సినిమాను తలపిస్తున్నాయని ప్రముఖ సినీ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రశంసించారు. రెండో సినిమాకే వరుణ్ కి అద్భుతమైన పాత్రను ధరించే అవకాశం వచ్చిందని ఆయన కొనియాడారు. సినిమాకి వరుణ్ తేజ్ న్యాయం చేశాడని క్రిష్ చెప్పాడని సిరివెన్నెల అన్నారు. సినిమాలో విభిన్న కోణాలున్న పాత్ర పోషించడం చాలా కష్టంతో కూడుకున్న విషయమని ఆయన తెలిపారు. దానిని వరుణ్ తేజ్ సమర్థవంతంగా పోషించారని ఆయన చెప్పారు. అందుకే ఇంటికెళ్లగానే వాళ్లమ్మ, చెల్లితో దిష్టితీయించాలని ఆయన నాగబాబుకు సూచించారు. ఈ సినిమాకు క్రిష్ తనపై చాలా పెద్ద బాధ్యత ఉంచాడని, దానిని సమర్థవంతంగా నిర్వర్తించానని ఆయన చెప్పారు. సినిమాలోని పాటల్లో చాలా క్లిష్టమైన భాషను ఉపయోగించానని చెప్పిన ఆయన, దానిని అర్థం చేసుకునేందుకైనా తెలుగు భాషను నేర్చుకుంటారని ఆయన ఆకాంక్షించారు.