: పీఓగా వేరేవారిని అంగీకరించం...రవీంద్రబాబే కావాలంటున్న చెంచులు, శ్రీశైలంలో ఉద్రిక్తత
శ్రీశైలం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు ఆఫీసర్ (పీఓ)గా యువ ఐఏఎస్ అధికారి రవీంద్రబాబు మినహా వేరేవారిని అంగీకరించేది లేదని కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని చెంచులు ఏపీ ప్రభుత్వానికి తేల్చిచెప్పారు. గత కొంతకాలంగా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా పనిచేస్తున్న రవీంద్రబాబు అక్కడి గిరిజనుల జీవన స్థితిగతులను మార్చడంలో సఫలీకృతులయ్యారు. ఈ క్రమంలో ఆయన అక్కడి చెంచులకు ఆత్మీయుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో సాధారణ బదిలీల్లో భాగంగా రవీంద్రబాబును ఇటీవల ప్రభుత్వం బదిలీ చేసింది. దీంతో మూడు జిల్లాలకు చెందిన చెంచులు భగ్గుమన్నారు. రవీంద్రబాబు బదిలీని అంగీకరించేది లేదని ఆడా మగా అన్న తేడా లేకుండా వేలాదిగా శ్రీశైలం తరలివచ్చి ఐటీడీఏ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో రవీంద్రబాబును ఈ నెల 22 దాకా అక్కడే కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రవీంద్రబాబు స్థానంలో కొత్త అధికారిని నియమించకుండానే ఆయనను అక్కడి నుంచి రిలీవ్ చేసి, కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ కు ఐటీడీఏ పీఓ అదనపు బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం చూస్తోంది. ప్రభుత్వ నిర్ణయంపై చూచాయగా సమాచారం అందుకున్న చెంచులు నేటి ఉదయం మరోమారు ఐటీడీఏ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఐటీడీఏ పీఓగా వేరే అధికారిని అంగీకరించేది లేదని తేల్చిచెప్పారు. రవీంద్రబాబు మినహా ఏ అధికారి వచ్చినా బాధ్యతలు తీసుకోకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. చెంచుల భారీ ఆందోళన నేపథ్యంలో అక్కడ పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.