: ‘విమోచన’ సందర్భంగా తెలంగాణలో బీజేపీ జెండావిష్కరణలు... నల్లగొండలో ఉద్రిక్తత
తెలంగాణ విమోచన దినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ జాతీయ జెండాల ఆవిష్కరణకు పూనుకుంది. హైదరాబాదులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని మొన్నటిదాకా బీజేపీ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీ డిమాండ్ కు ప్రభుత్వం పెద్దగా స్పందించిన దాఖలా కనిపించలేదు. దీంతో బీజేపీనే తన కార్యాలయాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ విమోచన దినం సందర్భంగా జెండాలను ఆవిష్కరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో నల్లగొండ కలెక్టరేట్ లో జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీ యత్నించింది. ఈ సందర్భంగా ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.