: రేవంత్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయండి... హైకోర్టులో టీ ఏసీబీ పిటిషన్
ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు, టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డికి మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై రేపు (శుక్రవారం) విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి. బెయిల్ లభించడం, బెయిల్ షరతులను సడలించిన తర్వాత రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని ఆ పిటిషన్ లో ఏసీబీ హైకోర్టుకు ఫిర్యాదు చేసింది. ఈ ప్రసంగాలతో కేసులో కీలక సాక్షులు ప్రభావితమయ్యే ప్రమాదముందని కూడా ఏసీబీ వాదిస్తోంది. ఇటీవల బెయిల్ షరతులను సడలిస్తూ కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల నేపథ్యంలో హైదరాబాదులో అడుగుపెట్టిన రేవంత్ రెడ్డి ఎల్బీనగర్ వద్ద తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఉద్దేశిస్తూ ‘‘ఆట కాదు... వేట మొదలైంది’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా రేవంత్ రెడ్డి పరుష పదజాలంతో కూడిన ప్రసంగాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు మంజూరు చేసిన బెయిల్ పిటిషన్ ను రద్దు చేయాలని ఏసీబీ కోర్టును ఆశ్రయించింది.