: కత్తితో దాడిచేసిన చైన్ స్నాచర్ ను ధైర్యంగా ఎదుర్కొని ఆదర్శంగా నిలిచిన యువతి
ఆ కుర్రాడు ఇప్పటికే ఎన్నో దొంగతనాలు చేసి జైలుకు వెళ్లివచ్చిన దొంగ. ఈ ఉదయం హైదరాబాద్, కేబీఆర్ పార్కు సమీపంలో నడుచుకుంటూ వెళుతున్న నవీన అనే మహిళను కత్తితో బెదిరించి, మెడలోని చైన్, సెల్ ఫోన్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆ మహిళ ధైర్యంగా ఎదుర్కోవడంతో, తన వద్ద ఉన్న కత్తితో దాడి చేశాడు. అయినా, ఆమె గట్టిగా అరుస్తూ, ప్రతిఘటించగా, స్థానికులు ఉరుకున వచ్చి దుండగుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అతడి పేరు కలాపి సంతోష్ అని, అతనిపై ఇప్పటివరకూ ఆరు కేసులు పెండింగులో ఉన్నాయని, బైకులు, ఆడవాళ్ల మెడల్లోని గొలుసులు లక్ష్యంగా దొంగతనాలు చేస్తాడని, గత నెల 31న జైలు నుంచి విడుదలయ్యాడని పోలీసులు వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. చైన్ స్నాచర్ ను గట్టిగా ఎదిరించిన నవీనను ఇప్పుడు అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.