: ఏపీ, తెలంగాణల మధ్య 'ఉల్లి' తీర్చిన లొల్లి!


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న ప్రధాన వివాదాల్లో ఒకటిగా ఉన్న వాహన పన్ను సమస్యను ఉల్లి కొరత తీర్చింది. ఈ మేరకు కౌంటర్‌ సిగ్నేచర్‌ ఒప్పందం చేసుకోవడానికి ఇరు రాష్ట్రాలూ సిద్ధమయ్యాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే, అక్టోబరు నుంచే రెండు రాష్ట్రాల మధ్య తిరిగే వాహనాలపై ఎటువంటి పన్నూ ఉండదు. ఈ వివరాల్లోకి వెళితే, తెలంగాణకు వచ్చే ఉల్లిపాయలు అత్యధికంగా కర్నూలు ప్రాంతం నుంచే వస్తాయి. దేశవ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు ఆకాశానికి అంటి, కొయ్యకుండానే కన్నీరు పెట్టిస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వానికి పెను నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది. సరిహద్దు దాటేందుకు ఉల్లిపాయల లారీలు చెల్లించాల్సిన ఫీజు కారణంగా ఒక కిలోపై ఏకంగా రూ. 6 వరకూ అదనపు ధర పడి, తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని లారీలు సరుకు కోసం కర్నూలు ప్రాంతానికి వెళ్లి రావాల్సి వుండటమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో దిగివచ్చిన తెలంగాణ సర్కారు, ఏపీ రవాణాశాఖ అధికారులతో మాట్లాడి, కౌంటర్‌ సిగ్నేచర్‌ విధానం పాటిద్దామన్న నిర్ణయానికి వచ్చారు. లేకుంటే తెలంగాణ సరిహద్దు దాటే ఒక్కో లారీ రూ. 5 వేలను ఏపీ రవాణా శాఖకు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక సంతకాలు పడితే, వచ్చే నెలారంభం నుంచి వాహన పన్ను నుంచి మినహాయింపులు లభిస్తాయి. అలా రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఓ లొల్లిని ఉల్లి తల్లి తీర్చినట్లయింది.

  • Loading...

More Telugu News