: జయలలిత ఇలాకాలో ధర్నాకు పవన్ కల్యాణ్ నిర్ణయం!
తమిళనాడులో జయలలిత సర్కారు, తెలుగు భాషకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలకు నిరసనగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ నెలాఖరున ధర్నా చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. తమిళ సర్కారు ప్రవేశపెట్టిన 'నిర్బంధ తమిళం' జీవో వల్ల, అక్కడ నివసిస్తున్న లక్షలాది మంది తెలుగువారు, మాతృభాషకు దూరమయ్యారు. తమిళనాట తెలుగును పరిరక్షించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ, 'తమిళనాడు తెలుగు యవశక్తి' అనే సంస్థ ఇప్పటికే పలు నిరసన ప్రదర్శనలు నిర్వహించి జయ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఈ సంస్థ ఇటీవల హైదరాబాద్ లో కూడా నిరసన చేపట్టింది. ఈ నేపథ్యంలో తమిళనాట తెలుగు సమస్యపై ఆరా తీసిన పవన్, వీరికి సంఘీభావం తెలుపుతూ, హోసూరులో ధర్నా చేపట్టాలని నిర్ణయించినట్టు ఆయనకు సన్నిహితంగా ఉండే వర్గాలు వెల్లడించాయి. తమ నిరసన తమిళ సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా కాకుండా, తెలుగును పరిరక్షించాలన్న డిమాండ్ తోనే ఉండాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. ఇదే సమయంలో ఆయన జయలలితను కూడా కలుసుకుని సమస్యపై చర్చించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.