: అనంతలో తుపాకీ కాల్పుల కలకలం
అనంతపురం జిల్లాలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ తెల్లవారుఝామున బీజాపూర్ ప్రాంతానికి చెందిన ఓ లారీ డ్రైవరు రమేష్, హైదరాబాద్ వైపు వెళుతుండగా, ఇండికా కారులో వచ్చిన గుర్తు తెలియని దుండగులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. ధర్మవరం మండలం సీతారాంపల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. దగ్గరి నుంచి గురి చూసి కాల్చడంతో లారీ డ్రైవర్ శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఘటన గురించిన సమాచారం అందుకున్న పోలీసులు రమేష్ ను బెంగళూరు సెయింట్ జాన్స్ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దుండగులు దోపిడీ దొంగలు అయివుంటారని భావిస్తున్న పోలీసులు, ఆ ప్రాంతం నుంచి బయటకు వెళ్లే అన్ని రహదారులను జల్లెడ పడుతున్నారు. లారీ డ్రైవర్ సరుకును అన్ లోడ్ చేసి డబ్బు తీసుకువెళుతున్నాడని గమనించిన దుండగులు ఈ ఘటనకు పాల్పడి వుండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.