: రష్యన్ విమానాన్ని కూల్చేందుకు ఫైటర్ జట్స్ ను పంపిన జపాన్
తమ గగనతలంలోకి అనుమతి లేకుండా ప్రవేశించిన రష్యా విమానాన్ని కూల్చేందుకు జపాన్ ఫైటర్స్ జట్స్ ను పంపిన ఘటన నేడు జరిగింది. జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులందించిన వివరాల ప్రకారం, ఈ విమానం ఉత్తర ప్రాంతంలోని హొకైడో దీవుల మీదకు వచ్చింది. క్షణాల్లో విషయం తెలుసుకున్న సైన్యాధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ, రెండు యుద్ధ విమానాలను పంపారని న్యూస్ ఏజన్సీ 'క్యోడో అండ్ జిజి' వెల్లడించింది. తక్షణం వెనక్కు వెళ్లాలన్న ఆదేశాలు పాటిస్తూ, ఆ రష్యా విమానం వెనుదిరిగింది. జపాన్ ఎయిర్ స్పేస్ పై దాదాపు 16 సెకన్ల పాటు ఈ విమానం ప్రయాణించిందని, గడచిన రెండేళ్లలో రష్యా విమానం జపాన్ గగనతలంలోకి రావడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. కాగా, జపాన్ కు సమీపాన రష్యా అధీనంలో ఉన్న ఒకినోషిమా దీవుల వద్ద ఆ దేశం రెండు టీయూ-95 బాంబర్ విమానాలు ఉంచిందని, అందువల్లే తాము తక్షణం స్పందించాల్సి వచ్చిందని జపాన్ రక్షణ శాఖ అధికారి ఒకరు వివరించారు.