: గోదావరి, కృష్ణ ఎలా కలుస్తాయంటే..!


కృష్ణమ్మ చెంతకు గోదారమ్మ చేరనుంది. భారత దేశ చరిత్రలో ఓ మహత్తర ఘట్టానికి 'సెప్టెంబర్ 16, 2015' సాక్షిగా నిలవనుంది. ఈ నేపథ్యంలో అసలు గోదావరి, కృష్ణ ఎలా కలుస్తాయి? గోదావరి నదిపై పోలవరం వద్ద ప్రాజెక్టును నిర్మించి, అక్కడ నీటిని కృష్ణా జిల్లా అవసరాలకు వాడుకుంటూ, కృష్ణలో మిగిలే నీటిని రాయలసీమకు తరలించాలన్న ఉద్దేశంతో ఉన్న ఏపీ సర్కారు, ఆ ప్రాజెక్టు పూర్తి కావడానికి ఆలస్యం అవుతుందన్న ఆలోచనతో రూపకల్పన చేసిందే పట్టిసీమ ప్రాజెక్టు. ఇది ఓ ఎత్తిపోతల పథకం. పట్టిసీమ ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా నీటిని కృష్ణానదికి చేర్చి రెండు నదులను అనుసంధానించి, ఆపై అంతే మొత్తం నీటిని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రాయలసీమకు తీసుకెళ్తారు. వాస్తవానికి పట్టిసీమ సైతం అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడంతో తాడిపూడి ఎత్తి పోతల పథకం ద్వారా గోదావరి నీటిని గుడ్డి గూడెం వద్ద పోలవరం కుడి కాలువలోకి కలిపి నీటిని కృష్ణానదికి తరలిస్తున్నారు. ఈ నీరు కుడి కాలువపై 171వ కిలోమీటరు వద్ద ఉన్న భలేరావు ట్యాంకు మీదుగా బుడమేరులోకి చేరుతుంది. ఆపై వెలగలేరు రెగ్యులేటర్ ను దాటే గోదావరి, బుడమేరు మళ్లింపు కాలువలో చేరి విజయవాడకు కూతవేటు దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. గోదావరి నీరు వెలగలేరు రెగ్యులేటర్ ను దాటితే రెండు నదుల అనుసంధానం జరిగినట్టే. పోలవరం పూర్తయితే, 80 టీఎంసీల నీరు కృష్ణమ్మకు తరలించే అవకాశాలు ఉండగా, ఈ పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 13 నుంచి 15 టీఎంసీల నీటిని కృష్ణకు చేర్చవచ్చు.

  • Loading...

More Telugu News