: దేవుడు నన్ను ఇందుకే బతికించి వుంచాడేమో!: చంద్రబాబు
12 సంవత్సరాల క్రితం... తిరుమలలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన శుభవేళ, దేవదేవునికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ఏడుకొండల పాదాల వద్దే దాడి జరిగింది. ఈ ఘటనలో చంద్రబాబు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనను చంద్రబాబు మరోసారి స్మరించుకున్నారు. "బ్రహ్మోత్సవం కన్నా మంచి రోజు మరొకటి వుండదు. 2003లో బ్రహ్మోత్సవాల నాడే నాపై దాడి జరిగింది. నేడు అదే సుదినాన కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం జరుగుతోంది. ఏపీ ప్రజలకు ఇంతకన్నా శుభప్రదమైన రోజు ఉంటుందా? బహుశా ఆ దేవుడు ఈ కార్యం కోసమే నన్ను ఆరోజు ప్రాణాలతో మిగిల్చాడేమో" అని 'ఈనాడు' దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు. నదుల అనుసంధానం తరువాత, గోదావరి, కృష్ణలు ఏపీ ప్రజలకు మరింత జీవనాధారం అవుతాయని ఆయన అన్నారు. వృథాగా సముద్రంలోకి పోయే 3 వేల టీఎంసీల నీటిని వివిధ ప్రాజెక్టుల ద్వారా ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లగలిగితే, అత్యంత సుసంపన్న రాష్ట్రంగా ఏపీ మిగులుతుందని అన్నారు. కరవు బారినపడ్డ అన్నదాతలను ఆదుకుంటామని, రైతులెవరూ అధైర్యపడవద్దని చంద్రబాబు హితవు పలికారు.