: కొల్లు రవీంద్ర, కొనకళ్లకు మరో గ్రామంలో అవమానం
ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణలకు కృష్ణా జిల్లాలో మరోసారి అవమానం ఎదురైంది. మచిలీపట్నం పోర్టు కోసం భూసేకరణ మరింత కష్టంగా మారింది. ప్రభుత్వ విజ్ఞప్తికి ప్రజల నుంచి సానుకూల స్పందన రావడం లేదు. రాజధాని ప్రాంతంలో వేల ఎకరాలు సేకరించిన అధికార పార్టీకి మచిలీపట్నం పోర్టు ఏర్పాటుకు భూసేకరణ కాస్త ఇబ్బందిగా మారింది. పోర్టు ఏర్పాటు పేరిట తమ పొట్టకొట్టవద్దని రైతులు నేతలకు ఎదురు తిరుగుతున్నారు. పరిహారం ఇస్తామని ఎంత చెబుతున్నా ప్రజలు వినడం లేదు. మచిలీపట్నం మండలంలోని కోన గ్రామంలో రైతులు తిరగబడి మంత్రి వ్యక్తిగత కార్యదర్శిని గాయపరిచి రెండు రోజులు కూడా కాకముందే, అదే మండలంలోని బుద్ధాలపాలెం గ్రామస్థులు మంత్రి, ఎంపీలకు ఝలక్కిచ్చారు. గ్రామం వెలుపలే మంత్రి, ఎంపీలను అడ్డుకున్న గ్రామస్థులు, భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసిన తరువాతే గ్రామంలో అడుగుపెట్టాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి, ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమావేశం కోసం ఏర్పాటు చేసిన కుర్చీలను ధ్వంసం చేశారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు.